పేదవాడి ఇంటికంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దది
మీది పైత్యం.. మాది పారదర్శకత
ప్రజల ఆస్తులను మనం కేవలం కష్టోడియన్లం అనే వాస్తవాన్ని గ్రహించనంత వరకు ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కాలేదు. అవసరం ఉన్న చోట పనులు చేపట్టకపోవడం ఎంత బాధ్యతా రాహిత్యమో, అవసరం లేని చోట వందల కోట్లు దుబారా కూడా అంతే బాధ్యతా రాహిత్యం. పేదవాడికి మీరు కట్టించిన ఇంటి విస్తీర్ణం కంటే మీ ప్యాలెస్ లో బాత్రూం సైజు పెద్దది. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి తన నివాసం కోసం విశాఖలో 10 ఎకరాలు, 450 కోట్లు కావాల్సి వచ్చింది. దీని కోసం వందల మంది స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్న హరిత రిసార్ట్స్ ను వారం రోజుల్లో నేల మట్టం చేశారు. అసలేం కడుతున్నారో చెప్పకుండా ఎందుకు గోప్యత పాటించాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రుషికొండ వస్తే ఎందుకు అడ్డుకున్నారు? 91 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించారు. తీరా చూస్తే కట్టడాలు కూల్చడానికి, మట్టి తవ్వకానికే 95 కోట్లు ఖర్చు చేశామని లెక్క రాశారు. ఆ 95 కోట్ల నిర్మాణ వ్యయాన్ని కూడా చివరకు 460 కోట్లకు ఎలా పెంచేశారు? ఇవన్నీ దాచేసి సిగ్గు లేకుండా ట్వీట్లు పెడుతున్నారు.
విశాఖపట్నానికి అనేకసార్లు రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు వచ్చారు. వారి హోదాకు తగ్గ విడిది ఏర్పాట్లు జరిగాయి. వారి కోసమే వివాదాస్పదమైన రుషికొండ భవన నిర్మాణమని చెప్పడం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావించి ఏం కడుతున్నారో కూడా ఎవరికీ తెలీకుండా వందల కోట్ల జనం సొమ్ముతో అవసరం లేని భవనం కట్టిన మీది పైత్యం. ప్రజల డబ్బుతో కట్టిన భవనాన్ని ప్రజలకు చూపించిన మాది పైత్యం కాదు. పారదర్శకత. మీరు పారదర్శకత లేని పాలన చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని పాతరేసి సమాధి చేశారు. మీ పైత్యపు ప్రేలాపనల కారణంగానే విశాఖపట్నం ప్రజలు మీ వై.ఎస్.ఆర్.సి.పి.ని ఛీ కొట్టారు. అయినా మీకు సిగ్గు రాలేదు. విశాఖపట్నంలో అత్యవసరంగా చెయ్యాల్సిన ప్రజా సమస్యలను గాలికి వదిలేసి యుద్ధ ప్రాతిపదికన రుషికొండ భవనాన్ని నిర్మించడం ఈ అయిదేళ్లలో విశాఖకు మీరు చేసిన ఘన కార్యంగా భావించాలా? ఆ డబ్బుతో పేదలకు పనికొచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చు. మీరు సాగించిన దాష్టీకాలను కూడా గొప్పగా చెప్పుకోవాలని చూస్తే 2024 ఎన్నికల్లో మిస్ అయిన సింగిల్ డిజిట్ 2029 ఎన్నికల్లో ఖాయమవుతుంది.